వైఎస్. షర్మిలా రెడ్డి పార్టీ రిలీజ్ డేట్ అనౌన్స్…జగనన్న బాణం వెనుక ఉన్నది ఎవరో తెలుసా…?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతుందా అనే దానిపై అన్ని సందేహాలు వీగిపోయాయి. ఏప్రిల్ 9న గ్రాండ్ గా వైఎస్ షర్మిల పార్టీ స్థాపిస్తుందని ఆమె సన్నిహితులు ఇప్పటికే మీడియాకు లీకులు అందిస్తున్నారు. ఖమ్మం వేదికగా ఈ పార్టీని ప్రకటించేందుకు ఆమె ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికే వైఎస్సార్సీపీ అధికార పక్షంగా ఉన్నప్పటికీ, తన సోదరుడు వైఎస్ జగన్ స్థాపించిన పార్టీలో కాకుండా, తెలంగాణలో సొంత వేదిక ఏర్పాటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఎందుకుంటే వైఎస్సార్సీపీ ఇఫ్పటికే తెలంగాణలో మూలాలు కలిగి ఉంది. గతంలో ఆ పార్టీ ఓ ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. అలాగే నియోజక వర్గ స్థాయిలో నిర్మాణం కూడా కలిగి ఉంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలతో పాటు ఇతర వైఎస్ అభిమానులతో ఆ పార్టీ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో యాక్టివ్ గానే ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల వైఎస్సార్సీపీ పార్టీనే తెలంగాణలో బలోపేతం చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించే వారు ఉన్నారు. అయితే సొంత కుంపటి ఎందుకు పెడుతున్నారు. అనేది ప్రశ్నార్థకంగా మారింది. జగనన్న వదిలిన బాణం అని గతంలో చెప్పుకున్న షర్మిల పార్టీ వెనుక ఏపీ సీఎం జగన్ కు సంబంధం ఉందా అంటే…ఆమె స్వయంగా అన్నకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో సైతం షర్మిల ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు. ప్రచారం చివరి దశలో కేవలం మంగళగిరిలో మాత్రమే ఆమె ప్రచారం చేశారు. సోదరుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆమె అంటిముట్టనట్టుగానే ఉన్నారు.

షర్మిల పార్టీ వెనుక ఉన్న ఎవరు…
అయితే అటు షర్మిలా పార్టీ వెనుక ఎవరి హస్తం ఉంది అనే దానిపై కూడా చర్చ నడుస్తోంది. ఆమె పార్టీ ఏర్పాటు వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రోత్సాహం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే, వారితో పాటు బీజేపీ హస్తం కూడా ఉందని కాంగ్రెస్ నేత ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇదిలా ఉంటే మరో కోణం కూడా బయటపడుతోంది. షర్మిల పార్టీ వెనుక ఆమె భర్త బ్రదర్ అనీల్ ప్రోత్సాహం ఉందని వైఎస్సార్సీపీ మాజీ నేత గోనే ప్రకాశ్ రావు ఆరోపిస్తున్నారు. అన్న జగన్ తో విభేదాలు ఉన్నాయని సైతం ఆయన ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

ఖమ్మంలో పార్టీ ఏర్పాటుకు ఇదే కారణం
ఇదిలా ఉంటే షర్మిలా రెడ్డి పార్టీని ఖమ్మం వేదికగా ప్రారంభించేందుకు వడివడిగా ఏర్పాట్లు సాగిపోతున్నాయి. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు షర్మిల పాదయాత్రనా, లేక బస్సు యాత్రనా అనేది తేలాల్సి ఉంది. ఖమ్మంలో పార్టీ స్థాపన వెనుక బలమైన కారణమే ఉంది. ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి వైఎస్సార్సీపీకి పట్టు ఉండటంతో పాటు, గతంలో ఆ పార్టీకి ఎంపీ ఉండటం విశేషం. అలాగే షర్మిల ఖమ్మం నుంచే పోటీ చేయనుందనే వార్తలు వస్తన్నాయి. అయితే గతంలో రక్షణ స్టీల్స్ బయ్యారం గనుల ఇష్యూలో సైతం షర్మిల భర్త బ్రదర్ అనిల్ కు ఈ ప్రాంతంలోని క్షేత్రస్థాయి నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వెరసి షర్మిల పార్టీ ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపుకు దూసుకొచ్చేందుకు సిద్ధం అవుతోంది.

Leave a Reply