Ap bandh march 5: మార్చ్ 5న ఏపీ బంద్…విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి పిలుపు

కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రేవేటికరణను వ్యతిరేకిస్తూ మార్చి 5 రాష్ట్ర బంద్ చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐక్య కార్మిక సంఘాల జేఏసీ బంద్ విజయవంతం చేయాలని కోరింది. ముఖ్యంగా కేంద్రంలోని మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం చేపట్టడం దారుణమని, తద్వారా 2.5 లక్షల కోట్లు సమికరిస్తామని ప్రధాని మోడీ ప్రకటన చేయడం బీజేపీ నియంతృత్వ విధానాలకు పరాకాష్టని విమర్శించారు. లక్షలాది మందికి ఉపాధినిస్తున్న సంస్థలను కార్పోరేట్ సంస్థల ప్రయోజనం కోసం మూసివేయడం దారుణమని విమర్శించారు. ఫోరం ఫర్ డెవలప్ మెంట్ ఫర్ నార్త్ ఆంధ్ర (FDNA) సైతం బంద్ కు మద్దతు పలికింది. ఈ సందర్భంగా ఫోరం సెక్రటరీ అజా శర్మ మాట్లాడుతూ…విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, రాష్ట్రప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాజకీయంగా, ఆర్ధికంగా, పారిశ్రామికంగా చాలా నష్టపోయిందని, అలాగే ఆంధ్రాబ్యాంక్ లాంటి ప్రభుత్వ బ్యాంకును తన కంటే 3 రేట్లు చిన్నదైన యూనియన్ బ్యాంకులో విలీనం చేసిన విషయాన్ని ఐక్య కార్మిక సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. నవరత్న హోదా కలిగిన ఏకైక ఉక్కు పరిశ్రమ అయిన విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటికరణ ద్వారా నిర్వీర్యం చేయాలని కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇదిలా ఉంటే గతంలో విశాఖ ప్రాంతంలో హిందూస్థాన్ జింక్ పరిశ్రమను కూడా నష్టాల సాకుతో ఎన్డీఏ హయాంలో వేదాంత గ్రూపుకు విక్రయించిన ఘటన గుర్తుచేశారు. అయితే 2014లో వేదాంత గ్రూపు పరిశ్రమను పూర్తిగా మూసివేసి 3వేల ఎకరాల పరిశ్రమ భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మేసి లాభం పొందిందని పేర్కొన్నారు. ఇఫ్పుడు కూడా లక్షల కోట్ల విలువైన 30వేల ఎకరాల విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పజెప్పేందుకే సంస్థను ప్రైవేటికరిస్తున్నారని కార్మిక సంఘాలు విమర్శించాయి.

మరోవైపు మార్చి 5న జరగనున్న రాష్ట్ర బంద్‌కు ప్రతిపక్ష టీడీపీ పార్టీ తన మద్దతు ప్రకటించింది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటానికైనా టీడీపీ సిద్దంగా ఉందని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి5న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌కు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు తెలుపుతోందని ఆయన లేఖను విడుదల చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో టీడీపీ ఎన్నడూ రాజీపడదని ఈ సందర్భంగాకు ఆయన గుర్తు చేశారు. బంద్ కు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ బంద్ ను విజయవంతం చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Leave a Reply