జనసేనకు కొత్త ఉత్సాహం…జేడీ రాకతో పూర్వవైభవం…విజయసాయికి చెక్ పెట్టేందుకేనా?

పంచాయితీ ఎన్నికలు జనసేనకు కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. ముఖ్యంగా జనసేన ఓటర్ బేస్ ఎంత ఉంది రాష్ట్రంలో తెలుసుకునేందుకు పంచాయితీ స్థానిక సంస్థల ఎన్నికలు దోహదం చేశాయనే చెప్పలి. ముఖ్యంగా జనసేన పార్టీ గత 2019 ఎన్నికలు ఓ పీడకలలా మిగిలిపోయాయి. పార్టీ అధినేత సైతం రెండు నియోజకవర్గాల నుంచి ఓడిపోవడం కార్యకర్తలను నిరుత్సాహానికి గురి చేసింది. నిజానికి జనసేనకు పడాల్సిన టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అటు జగన్ మోహన్ రెడ్డికి ట్రాన్స్ ఫర్ అయ్యాయని, లేకపోతే జనసేనకు కనీసం 20 సీట్లు వచ్చేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి జనసేన టీడీపీతో రహస్య ఒప్పందం చేసుకుందనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దీంతో ఆ ప్రభావం ఓటర్లపై పడింది. ఫలితంగా జనసేన ఓట్లు సైతం వైఎస్సార్సీపీకే పడ్డాయని తర్వాత జరిగిన పలు అధ్యయనాల్లో తేలింది. నిజానికి జనసేనకు ఎంతో బలంగా వెన్నుదన్నుగా నిలిచిన కాపువర్గం కూడా వైఎస్సర్సీపీ వైపే కదిలింది. దీంతో జనసేనకు పూర్తి స్థాయి దెబ్బపడింది. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనే ఆయన పార్టీ భవిష్యత్తుపై కాస్త ఆశలు రేపింది. ప్రజారాజ్యం తరహాలోనే జనసేన కూడా ఓటమి తర్వాత అంతర్థానం అవుతుందని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను వెనక్కు తగ్గడం లేదని, పార్టీ కొనసాగుతుందని తెలిపారు. నిజానికి ఇలాంటి మెసేజ్ జనాల్లోకి వెళితే జనసేన పట్ల ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఆ పార్టీకి ఒక ఓటు బ్యాంకు తయారవుతుంది. అందుకు సాక్ష్యమే పంచాయితీ ఎన్నికల ఫలితాలు, పార్టీకి దాదాపు 20 శాతం ఓట్లు పడినట్లు వెల్లడయిన ఫలితాలను బట్టి తెలుస్తోంది.

జేడీ రాకతో విజయసాయికి చెక్..?
అయితే ఈ నేపథ్యంలోనే వైజాగ్ నుంచి జనసేన తరపున పోటీ చేసిన మాజీ సీబీఐ జాయింట్ డైరక్టర్ లక్ష్మీ నారాయణ మరోసారి పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వడం పార్టీకి కొత్త ఉత్సాహం ఇస్తోంది. ఎందుకుంటే వైజాగ్ నగరంలో సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి పాగా వేసి ఉన్నారు. అంతేకాదు భవిష్యత్తులో ఆయన విశాఖ ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణను రంగంలోకి దింపితే విజయసాయి దూకుడుకు కాస్త చెక్ పెట్టినట్లు అవుతుందని పార్టీ అంతర్గత మీటింగ్స్ లో వెల్లడైంది. అయితే విజయసాయి రెడ్డికి, జేడీ లక్ష్మీనారాయణకు మధ్య గతంలో సంబంధం ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులో A2గా ఉన్న విజయసాయిరెడ్డిని పలుమార్లు జేడీ లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. అంతేకాదు ఆ కేసులో జగన్ మోహన్ రెడ్డిపై కూడా లక్ష్మీనారాయణ నేతృత్వంలోనే విచారణ కొనసాగింది. ఈ నేపథ్యంలో వైసీపీ దూకుడు సరైన సమాధానం ఇచ్చే సత్తా లక్ష్మీనారాయణకు ఉందని జనసేన అధినేత పవన్ భావిస్తున్నారు. అయితే ముందు ముందు వైజాగ్ రాజకీయం ఎలా ఉండనుందో చూడాలి.

Leave a Reply