అసలు ఎవరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…ఏంటీ వివాదం…!

రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తన మార్కు రాజకీయాలతో ముందుకు వెళుతోంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకు పెట్టేందుకు ఏ ఒక్క అంశాన్ని కూడా వదలడం లేదు. ముఖ్యంగా మతపరమైన అంశాల ద్వారా ప్రజల్లో తమ రాజకీయాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. గతంలో ప్రజా సమస్యలపై ముందుకు వెళ్లిన బీజేపీ, వాటికి తోడుగా మతపరమైన అంశాలతో కూడా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర బీజేపీ తెలంగాణ సాంఘిక సంక్షేమ డైరక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను టార్గెట్ చేస్తోంది. తాజాగా ఆయన స్వేరోస్ భీమ్ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో స్వేరో సభ్యులతో కలసి ఆయన దేవతలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రవీణ్ కుమార్ కూడా చేతులు చాచి ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ రాజ్యాంగ బాధ్యతలకు విరుద్ధంగా హిందువుల విశ్వాసాలను గాయపరిచారని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. స్వేరోస్‌పై పలు ఆరోపణలు వస్తున్నా గురుకుల విద్యావ్యవస్థలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను సుదీర్ఘ కాలం ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోందో సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. గురుకుల విద్యావ్యవస్థకు మరో ఐఏఎస్ అధికారిని నియమించాలని, ప్రవీణ్ కుమార్ పై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదంతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ ప్రయత్నం కొంత ప్రతిఫలం ఇస్తుందనే చెప్పాలి. ఎందుకంటే హిందూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను టార్గెట్ చేయడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వంపై హిందు వ్యతిరేక ముద్ర వేయడంలో కొంత మేర సఫలం అవుతున్న మాట నిజమే. కానీ బీజేపీ తన మతమార్కు రాజకీయాలతో మైనారిటీలను ఇరుకున పెట్టే ప్రయత్నంలో సఫలం అయినంతగా, దళితులపై ఆరోపణలు చేస్తే అది ఆ పార్టీలోని దళిత నేతలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పార్టీలోని ఇంటర్నట్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీలో ఇటీవల చేరిన దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రులు బాబుమోహన్, విజయరామారావు, మోత్కుపల్లి నర్సింహులు లాంటి వాళ్లకు వారి వారి సామాజిక వర్గాల్లో సంజాయిషీ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.

ఎవరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ నేడు పల్లె ప్రాంతాల్లో ఆయనకు చాలా మంచి పేరుంది. ఒకప్పుడు పేపర్ తెరవగానే సమస్యల పుట్టిల్లు సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అనే స్థాయి నుంచి నేడు అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కే దక్కింది. తెలంగాణ గర్వించే బిడ్డ మలావత్ పూర్ణ ను ప్రొత్సహించి ఆమెను ఎవరెస్ట్ శిఖరం ఎక్కించి ఆమె ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దే…ఇప్పటికే సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులను చదువులతో పాటు ఇతర రంగాల్లో ముందుండేలా ప్రొత్సహిస్తున్న ప్రవీణ్…తమ సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశారు.

వందలాది విద్యార్థులు ఐఐటీ, ట్రిఫుల్ ఐటీ, వంటి సీట్లు, టాటా ఇన్సిటిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వంటి విద్యాసంస్థల్లో సీట్లో సాధించారు. దాదాపు 17ఏళ్లపాటు వివిధ స్థాయిల్లో పోలీసుల శాఖలో పనిచేసిన ప్రవీణ్ కుమార్.. ఐదేళ్ల క్రితం ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోనూ పరిపాలన శాస్త్రంలో పీజీ చదివి..చదువులకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించారు. అక్కడి నుంచి వచ్చాకే అప్పటి సీఎం కిరణ్ కుమార్ తో పట్టుబట్టి మరీ గురుకుల సంస్థలకు కార్యదర్శి అయ్యారు. ఒక పోలీసు అధికారి విద్యాశాఖలో బాధ్యతలు నిర్వహించడం ఇదే మొదటిసారి. ప్రవీణ్ కుమార్ గురుకులాల అభివృద్ధికి చేస్తోన్న కృషికి ఎంతోమంది విద్యార్థులు ఇందులో చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను దేవుడిలా కొలిచే కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. సీఎం కేసీఆర్ సైతం సాంఘిక సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ బాధ్యతను ఆయనకే అప్పగించారు. తెలంగాణ ఏర్పటైన 7 సంవత్సరాల్లో ఎస్సీ,ఎస్టీ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై ఒక్క ఆరోపణ కూడా రాలేదు.

ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఆరాధ్య భావం ఏర్పడింది. ఆయన ఏర్పాటు చేసి స్వేరోస్ సంస్థ నేడు గ్రామీణ స్థాయిలో నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుంది. అటు రాజకీయ పార్టీలు సైతం వీటి జోలికి వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు అనవసరంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను టార్గెట్ చేశారని ఆ పార్టీకి చెందిన కింది స్థాయి కేడర్ అంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ వరకే రాజకీయాలు చేసే బీజేపీ ఇప్పుడిప్పుడే జిల్లాల్లో ఎదుగుతోంది. నెమ్మది నెమ్మదిగా అన్ని ఎస్సీ, ఎస్టీలతో సహా అన్ని వర్గాల వారు ఆ పార్టీ వైపు నమ్మకంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై పోరాటాన్ని కుల పంచాయితీల వైపు లాగితే, తెలంగాణలో రాజకీయ మనుగడకే ప్రమాదమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply