పసిడి 40 వేలకు దిగువే…మహిళలకు ఇక పండగే

బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. దీంతో ఒక్క సారిగా మహిళలకు శుభవార్త అందినట్లు అయ్యింది. ముఖ్యంగా పసిడి ప్రియులు ఇప్పుడే బంగారం కొనాలా, లేక మరింత పతనం అయ్యాక కొనాలా అనే సందిగ్ధతలో పడ్డారు. అయితే గత కొద్దివారాలుగా ఫ్యూచర్ మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.45,000కు దిగువకు పతనం అయ్యింది. ఇప్పటికే ఏడాడది కనిష్టానికి పసిడి ధరలు చేరుకున్నాయి. పసిడి ధరలు భవిష్యత్తులో మరింత పడిపోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ క్షీణత స్థిరంగా కొనసాగకపోవచ్చని అంటున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.57.00 పెరిగింది. దీంతో రూ.45008.00 వద్ద ముగియగా, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 45,300.00 వద్ద ముగిసాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లో చివరి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ మళ్లీ పెరిగాయి. ఫలితంగా ఔన్స్ (31 గ్రాములు) బంగారం 1744 డాలర్ల సమీపానికి చేరుకుంది. అయితే అటు అంతర్జాతీయంగా కొద్ది కొద్దిగా బంగారంలో హెచ్చుదల కనిపిస్తోంది. అయినప్పటికీ, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు రీత్యా బంగారం ధరలు తగ్గుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి.
బంగారం మరింత తగ్గొచ్చు…కారణాలు ఇవే…
అయితే బంగారం ధరలు భారీగా తగ్గుతాయని కొందరు ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి కారణాలు ఉన్నాయి. అటు బంగారం తగ్గడానికి గల ప్రధాన కారణాల్లో ఇటీవల యూఎస్‌ ట్రెజరీ బాండ్ల ధరలు బలహీనపడటంతో యీల్డ్స్‌ పుంజుకుంటున్నట్లు తెలుపుతున్నారు. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ బలపడుతుండటం కూడా పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలియజేశారు. యూఎస్‌ కొత్త ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ భారీ ఉపశమన ప్యాకేజీకి ప్రకటిస్తారు అనే నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్న అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో బంగారం కంటే షేర్ మార్కెట్ ఈక్విటీలు తదితర పెట్టుబడి సాధనాలకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలియజేశారు. అంతేకాదు కోవిడ్ వ్యాక్సిన్ విడుదల చేయడంతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో పసిడిపై కస్టమ్స్‌ డ్యూటీని 2.5% తగ్గించడం కూడా దీనికి జత కలసింది. ఫలితంగా బంగారం ధరలు రూ. 45,000 మార్క్‌ దిగువకు చేరాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే బంగారం ధరలు మరోసారి రూ. 40 వేల దిగువకు చేరతాయిని భావిస్తున్నారు.

Leave a Reply