ఒకే ఒక్కడు…మాటల్లేవ్..ప్రచారాల్లేవ్…ఓన్లీ చేతలే…జగన్ విజయరహస్యం…!

ఒక్క సభ పెట్టలేదు…కనీసం ఒక్క కొత్త పథకం కూడా అనౌన్స్ చేయలేదు. కానీ అఖండ విజయం సాధ్యం అయ్యింది. ఏపీలో సీఎం జగన్ తాజాగా మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం రాజకీయ వర్గాలను షాక్ కు గురిచేస్తోంది. ఓ వైపు కేంద్రంలోని బీజేపీ పార్టీ ప్రతీ ఎన్నికకు కేంద్ర మంత్రులను, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధాని మంత్రిని సైతం రంగంలోకి దించి హోరుమని సభలతోనూ, మీడియా హడావిడితోనూ, కొత్త కొత్త వివాదాలతోనూ తెరపైకి వచ్చి ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించే ఎలక్షన్ ఇంజనీరింగ్ వ్యవస్థను నెలకొల్పితే అందుకు పూర్తి భిన్నంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎంతో కీలకమైన తాను ప్రకటించిన మూడు రాజధానుల ఫార్ములాకు రిఫరెండంగా భావించే ప్రతిష్టాత్మక ఎన్నికలకు గడప దాటకుండా, కనీసం ఓటేయమని జనాలను అడగకుండా, ఒక్క కొత్త పథకం కూడా స్టార్ట్ చేయకుండా సైలెంటుగా ఒక వేవ్ లాగా విజయాన్ని అందుకున్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు. చిత్తూరు నుంచి కర్నూలు వరకూ అన్ని జిల్లాల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసింది. నిజానికి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రచారం చేశారు. అంతేకాదు పలు ఉప ఎన్నికలకు కూడా ఆయన ప్రచారం చేశారు. అలాంటిది జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. మాటలు కాదు చేతలు ముఖ్యం అని జగన్ నిరూపించారు. నిజానికి జగన్ మోహన్ రెడ్డి అమరావతి నుంచి రాజధాని తరలింపు అంశంతో ఈ ఎన్నికలు ముడిపడి ఉన్నాయి. అయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి కనీసం తమ పార్టీకి ఓటు వేయండి అని కూడా ఎక్కడ చిన్న ట్వీట్ కూడా చేయలేదు. అయినప్పటికీ వైసీపీ ప్రభంజనం సృష్టించింది.

పొలిటికల్ పండితులను కూడా విస్మయానికి గురిచేస్తున్న జగన్ యాటిట్యూడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కీలక పదవుల్లో ఉన్న నేతలు ఎన్నికలు అనగానే తమ బాధ్యతలను పక్కన పెట్టేసి అవసరం ఉన్నా లేకున్నా తగదునమ్మా అంటూ బయలుదేరి, ఎన్నికల ప్రచారానికి సమాయాన్ని వృధా చేయడం పరిపాటిగా మారింది. గతంలో జీహెచ్ఎంసీ లాంటి మునిసిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ నేతలు ఏకంగా అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అలాగే ఇతర శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాళ్లు పనులన్నీ వదులుకొని మరీ ప్రచారానికి పరిమితం అయ్యారు. దాని వల్ల ఒరిగిని ప్రయోజనం శూన్యమని, సీఎం జగన్ చెప్పకనే చెప్పేశారు.

ప్రచారాని కన్నా, చేసేపనినే ప్రజలు ఎక్కువగా గుర్తిస్తారని సీఎం జగన్ చేతల్లో చూపడం విశేషం. మరోవైపు ఏపీలో ప్రవేశపెట్టిన పథకాలు అటు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఏపీలో వైసీపీ ఓటు బ్యాంకు అమాంతం పెరిగిందని, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply