మహా రాజకీయాల్లో కలకలం….ప్రతినెలా రూ. 100కోట్లు వసూలు చేయాలన్న హోం మంత్రి….మాజీ పోలీస్ బాస్ సంచలన ఆరోపణలు.

మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగింది. ముంబయి మాజీ పోలీస్ కమిషన్ పరమ్ సింగ్ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముక్ పై సంచలన ఆరోపణలు కలకలం రేపాయి. ఈ మధ్యే సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజే విధుల్లో ఉన్నప్పుడు…ప్రతినెలా తనకు వందకోట్లు వసూలు చేసి ఇవ్వాలని హోంమంత్రి టార్గెట్ ఫిక్స్ చేసినట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయానికి సంబంధించి చర్చించేందుకు సచిన్ వాజేను తన ఇంటికి పిలిపించుకున్నట్లు ఆరోపించారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేకి పరమ్ వీర్ సింగ్ లేఖ రాశారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలతో ఉన్న వాహనం కలకలం రేపిన సంఘటనలో సచిన్ వాజేని NIAఇప్పటికే అరెస్టు చేసింది. ఈ సంఘటన చోటచేసుకున్న సమయంలో ముంబయి కమిషనర్ గా ఉన్న పరమ్ సింగ్ పై మహా సర్కార్ బదిలీ వేటువేసింది.

సీఎం ఉద్దవ్ థాక్రేకి పరమ్ వీర్ సింగ్ రాసిన లేఖలో….ముంబయి క్రైం ఇంటిలిజెన్స్ యూనిట్ హెడ్ గా ఉన్న సమయంలో సచిన్ వాజేని హోంమినిస్టర్ అనిల్ దేశ్ ముక్ తరచుగా తన అధికారిక నివాసానికి పిలిపించేవారని…ఫండ్స్ వసూలు చేయాలని కోరినట్లు పేర్కొన్నాడు. ఫిబ్రవరిలో హోంమంత్రి ఒకసారి సచిన్ వాజేని తన నివాసానికి పిలిచారని…ఆ సమయంలో హోంమంత్రి సిబ్బందితోపాటు పర్సనల్ సెక్రటరీ కూడా అక్కడ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతీనెల వంద కోట్లు వసూళ్లు చేయాలని తాను టార్గెట్ గా పెట్టుకున్నట్లు సచిన్ వాజేతో హోంమంత్రి చెప్పారని పరమ్ వీర్ సింగ్ లేఖ పేర్కొన్నారు.

అయితే పరమ్ వీర్ సింగ్ లేఖను హెంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కొట్టిపారేశారు. అంబానీ ఇంటి వద్ద బాంబు బెదిరింపు కేసు నుంచి బయటపడేందుకే అతనిలా వ్యవహారిస్తున్నాడన్నారు. ఈ కేసులో సచిన్ వాజేతోపాటు పరమ్ వీర్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తుండటంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని హోంమంత్రి ట్వీట్ చేశారు.

పరమ్ వీర్ సింగ్ ఆయన తోటి ఉద్యోగులు తీవ్ర తప్పిదాలకు పాల్పడినందుకే వేటు పడిందని హోంమంత్రి అనిల్ దేశ్ ముక్ ఇదివరకే పేర్కొన్నారు. సచిన్ వాజే కేసులో విచారణ సజావుగా సాగేందుకు పరమ్ సింగ్ను బదిలీ చేసినట్లు చెప్పారు. పరమ్ వీర్ తోపాటు తప్పిదాలకు పాల్పడ్డవారిపై నివేదిక అందాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే హోంమంత్రిని టార్గెట్ చేస్తూ పరమ్ సింగ్ లేఖ రాయడం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

Leave a Reply