అన్న వదిలిన బాటలో…మరో లీడర్ గా ఎదిగేది ఎవరు? తెలంగాణలో షర్మిల గళమెత్తుతుందా? ఆంధ్రాలో పవన్ పంజా విసురుతారా?

2023 ఎన్నికల నాటికి తెలంగాణలో ప్రతిపక్షాల పోటీ పెరగనుంది. కొత్తగా వస్తున్న పార్టీల జోరు చూస్తుంటే తెలంగాణ రాజకీయ దంగల్ రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే ఏపీకి చెందిన వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంటే, మరోవైపు పవనకళ్యాణ్ తన జనసేన పార్టీని తెలంగాణలో విస్తరించే దిశగా ప్లాన్స్ వేస్తున్నారు. అయితే రెండు పార్టీలకు మధ్య ఓ సామీప్యం ఉంది. అదే రాజకీయ నేపథ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం 2009 ప్రజారాజ్యం పార్టీ ద్వారా జరిగింది. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయనప్పటికీ, అన్న చిరంజీవికి మద్దతుగా రాష్ట్రమంతా కలియదిరిగారు. అంతేకాదు యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అయితే చిరంజీవి ఎన్నికల్లో అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రస్ లో విలీనం చేసి, ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. అయితే పవన్ మాత్రం తన రాజకీయ ప్రస్థానాన్ని వదలలేదు. తమను నమ్ముకొని రాజకీయాల్లోకి ప్రవేశించిన వారికి మరో వేదిక ఇవ్వాలని అనుకున్నాడు. అన్న ఎక్కడైతే ఆగిపోయాడో, అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ తన రాజకీయాల్లో మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. అదే జనసేనగా మారింది. జనసేన ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ మొదటి దెబ్బలోనే తన సత్తా చాటాడు.

ప్రజారాజ్యం ముగింపే…జనసేనకు పునాది…

2014 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్రకటించి బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతునిచ్చి తాను మాత్రం ఎన్నికల ప్రచారానికే పరిమితం అయ్యాడు. అయితే పవన్ కళ్యాణ్ రాకతోనే ఏపీలోని ఓ బలమైన సామాజిక వర్గం టీడీపీ, బీజేపీ వైపు చూసింది. ఫలితంగా స్వల్ప ఓట్ల తేడాతో జగన్ మోహన్ రెడ్డి అధికారానికి దూరం కాగా, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. అయితే 2019లో మాత్రం ఎవరి దారి వారు చూసుకోగా, చంద్రబాబు నాయుడు అధికారానికి దూరం అయ్యారు. ఇక్కడ అసలు సంగతి ఏమిటంటే గెలుపు ఓటమి ప్రస్తావన కాకుండా చూస్తే, తమను నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చిన వారికి ప్రత్యామ్నాయ వేదిక కల్పించడంలో ఓ మేర సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. భవిష్యత్తులో కూడా ఈ వేదిక కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు సార్లు ప్రకటించారు. ఎన్ని ఓటములు ఎదురైనా పార్టీ జెండాను బలంగా పాతేందుకు సిద్ధం అని బహిరంగంగా ప్రకటించారు.

అన్నపై తిరుగుబాటే షర్మిలా రాజకీయమా…

ఇక ఏపీ రాజకీయాల్లో దూసుకొచ్చిన మరో పార్టీ వైఎస్సార్సీపీ, తండ్రి అకాల మరణంతో ఆ తర్వాత జరిగిన రాజకీయా పరిణామాలతో వైఎస్ జగన్ స్థాపించిన ఈ పార్టీ తొలినాళ్లలో ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో జైలులో రిమాండ్ లోకి తీసుకున్న సమయంలో సోదరి షర్మిల పార్టీని నడిపించారు. అంతేకాదు ఆమె పాదయాత్ర చేసి పార్టీని గ్రామస్థాయిలో ముందుండి నడిపించారు. అంతేకాదు పార్టీని నడిపించడంలో ఆమె సక్సెస్ అయ్యారు. అయితే 2014 ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే ఆ ఎన్నికల్లో అధికారం దక్కకపోవడంతో ఆమె రాజకీయాలకు దూరం అయ్యారు. మళ్లీ 2019 ఎన్నికల్లో కూడా అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు 2021లో మరో సారి రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. అయితే అన్న జగన్ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ, ఆ పార్టీలో ఆమెకు ఇప్పటికే గౌరవప్రదమైన స్థానం దక్కే అవకాశం ఉన్నప్పటకీ, ఎందుకు మరో వేదిక పెడుతున్నారు అనే దానిపై క్లారిటీ లేదు. నిజానికి తెలంగాణలో రాజకీయ కేవలం సాకుమాత్రమే అని భవిష్యత్తులో ఏపీలో కూడా షర్మిలా వైసీపీకి ప్రతిపక్షంగా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే టాక్ వినిపిస్తోంది.

ఇద్దరి లక్ష్యాలు వేర్వేరు..

ఒకరు అన్న వదిలేసిన ధనస్సుతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంటే, మరొకరు అన్నపైనే బాణం ఎక్కుపెడుతున్నారు. మొత్తానికి 2024 రాజకీయాలు ఇఫ్పటి నుంచే వేడెక్కే అవకాశం లేకపోలేదు.

Leave a Reply